బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకులకు గాయాలు

- రహదారి పనులతో ప్రమాదాల పరంపర!
ముద్దనూరు–పులివెందుల నాలుగు రోడ్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల వద్ద తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముద్దనూరు మండల పరిధిలోని నల్లబల్లె అగ్గిపుల్లల సత్రం సమీపంలో గురువారం రాత్రి మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల నుంచి పులివెందులలో జరిగే వివాహ వేడుకకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎం. అరుణ్ కుమార్ (20), ఎం. వినోద్ కుమార్ (24), ఎం. మనోహర్ (20) ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముగ్గురూ గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. రహదారి నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కాంట్రాక్టర్లను కోరుతున్నారు. సంబంధిత అధికారులు కూడా స్పందించి నిర్మాణ పనుల వద్ద తగిన పర్యవేక్షణ చేపట్టి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే














