24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు

విశాఖపట్నం,: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్ని జోన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిన్న, ఈరోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్.. ఈదురుగాలులు, వర్షాలకు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితర ఘటనల ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా అందే ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా జోనల్ కమిషనర్లు, విభాగాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.ప్రధాన రహదారులపై నేలకూలిన, విరిగిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెట్ల కొమ్మలను కటింగ్ చేసి, రహదారులకు అడ్డంకులు లేకుండా వెంటనే తరలించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజారోగ్య చర్యలపై ప్రతి అరగంటకూ నివేదిక అందించాలని అదనపు కమిషనర్, ప్రధాన వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా, నీరు కలుషితం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రజల కోసం జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. 12 పునరావాస కేంద్రాల్లో 490 మంది బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి భోజన సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












