చౌటుప్పల్‌లో జోగిని హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్ట్

యాదాద్రి : జిల్లాలోని చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న పవన్, హర్షిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,319 గ్రాముల బంగారం, 3.600కిలోల వెండి, రూ.9లక్షల నగదుతోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారికి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. జోగిని సుధాకర్ అసలు పేరు రాళ్లబండ సుధాకర్, అతడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక. సుధాకర్.. జోగినిగా, పండగల సమయంలో పూజారిగా పని చేస్తూ చౌటుప్పల్‌లో నివసిస్తున్నారు. అవివాహితుడు అయిన అతడు బంధువుల్లోని ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని.. పెంచుతున్నారు. అయితే సుధాకర్ తరచూ అసోంలోని శక్తిపీఠం కామాక్య ఆలయానికి తరచూ వెళ్లి వస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన హర్షిత్, పవన్‌లు శిష్యులుగా చేరారు. శనివారం అర్ధరాత్రి జోగిని సుధాకర్ గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం డబ్బు, నగదు, కారుతో వారు ఉడాయించారు. అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్ నివాసం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలో పవన్, హర్షిత్ నిందితులుగా గుర్తించారు. కారులో పరారవుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












