ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు!

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీలోని చావ్డీ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారా వద్ద ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాద సమయంలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం నీటి ట్యాంకర్లు, రెస్క్యూ వాహనాలతో పాటు కనీసం ఆరు అగ్నిమాపక బృందాలను అక్కడికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చేపడుతున్నారు. మరోవైపు సీనియర్ అధికారులు స్వయంగా ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు, ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












